టీఆర్పీ పార్టీలోకి యువత భారీ చేరిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లోకి మొగుళ్లపల్లి మండలం నుంచి యువత భారీ సంఖ్యలో చేరారు.ఈ సందర్భంగా నిర్వహించిన చేరిక కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు పల్లెబోయిన అశోక్ యువతకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు రవి పటేల్ ఆదేశాల మేరకు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పల్లెబోయిన అశోక్ ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి మొగుళ్లపల్లి మండలంలోని పలువురు యువకులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా పల్లెబోయిన అశోక్ మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలో ప్రజా సమస్యలపై ఎల్లవేళలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన పోరాటం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరంతరం ప్రజల ముందుకు తీసుకెళ్లి ఎండగట్టాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ జెండా, ఎజెండాను గడపగడపకు తీసుకెళ్లడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలు సంపాదించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బండారి రవికుమార్ యాదవ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కొడాలి శివ, ఉడుత నాగరాజు, మడికే సందీప్, జంగం అరవింద్, జడల ప్రభాస్ తదితర యువ నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.యువత భారీగా పార్టీలో చేరడం జిల్లాలో టీఆర్పీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.