
ఈ69 న్యూస్ జనగామ/జఫర్ఘఢ్
జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలం తమ్మడపల్లి (జి) గ్రామంలోని 6వ వార్డులో దాదాపు 15 రోజులుగా,అలాగే బైండ్లవాడలో మూడు రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి,గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమీపంలో ఒక్క హ్యాండ్ పంప్ కూడా లేకపోవడంతో,స్నానం చేయడానికి,తాగడానికి,వంటకు కావలసిన నీళ్ల కోసం పొలాల దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్య గురించి గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఉన్నప్పటికీ,పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా ఇప్పటివరకు మరమ్మత్తు జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.చిన్న పిల్లలు,మహిళలు,వృద్ధులు ఈ కరువుతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో,తక్షణ చర్యలు తీసుకుని తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలంటూ గ్రామ ప్రజలు కోరుతున్నారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు రాయపర్తి రాజు మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.