తిరుమలనాధ దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
చైర్మన్ గా నీల నర్సింహులు-డైరెక్టర్లుగా తాటికొండ యాదగిరి (హోటల్),గట్టు ప్రశాంత్,మునిగెల కుమారస్వామి,మరియు గుగులోతు లత బాధ్యతలు
తిరుమలనాథ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్గా నీల నర్సింహులు,డైరెక్టర్లతో కలిసి ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు.కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..అతి ప్రాచీన చరిత్ర కలిగిన తిరుమలనాథ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.నూతనంగా ఏర్పడిన పాలకవర్గం ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని సూచించారు.ఆలయానికి వచ్చే భక్తులకు వసతి,రవాణా వంటి సౌకర్యాలు మెరుగుపరిచేలా ప్రణాళికలు రూపొందించాలని,భక్తులు దైవ సన్నిధిలో ప్రశాంతంగా సమయం గడిపే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.భక్తులను ఆకర్షించేలా ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పాలకవర్గాన్ని కోరారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని,తిరుమలనాథ స్వామి ఆలయంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి,చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు,దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ ఈవో,ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు