
ధర్మసాగర్లో వెలుగులోకి వచ్చిన భూ వివాదం
హనుమకొండ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలంలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా ఇంటి స్థలంలో అక్రమంగా ప్రవేశించి చదను చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ధర్మసాగర్ గ్రామానికి చెందిన రావుల నీరజ్ రెడ్డి (21)పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తెలిపిన వివరాల ప్రకారం-తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నంబరు 1070 ఎ/1/2లోని 1867.33 చ.గజాల స్థలంపై రావుల వెంకట రెడ్డి (తండ్రి:భుజంగ రెడ్డి,మాజి ఉప సర్పంచ్)తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.ఈ వ్యవహారంలో ఫోరెన్సిక్ ట్రూత్ ల్యాబ్ పరీక్షలతో ఆ డాక్యుమెంట్ నకిలీ (ఫేక్) అని నిర్ధారించబడిందని,ప్రస్తుతం కేసు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు,హనుమకొండలో విచారణలో ఉందని ఆయన తెలిపారు.అయితే కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ,ఇటీవల రావుల వెంకట రెడ్డి,టేకుమట్ల విష్ణు,మధుకర్ రెడ్డి లు జేసిబి యజమాని పుట్ట నవీన్ తో కలిసి తన ఇంటి స్థలములో ప్రవేశించి బలవంతంగా చదను చేశారని నీరజ్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.తాను ఆపడానికి ప్రయత్నించగా,వారు ప్రాణహానీ బెదిరింపులు చేసినట్టు,ఇప్పుడే చంపి ఇక్కడే పాతిపెడతాం అని దాడి చేయబోయారని ఆరోపించారు.అదేవిధంగా టేకుమట్ల విష్ణు తన ఇంటి సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడని,ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నెం.220/2025 నమోదైనట్లు తెలిపారు.కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దౌర్జన్యంగా చదను చేసిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మసాగర్ పోలీసులకు నీరజ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు