జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాలో నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో,వాటిని వెంటనే తొలగించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఆయన కలెక్టర్‌ను కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమని, స్వచ్ఛమైన, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ఓటర్ల జాబితా పూర్తిగా పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఓటర్ జాబితాలో నకిలీ పేర్లు, అర్హతలేని ఓటర్లు ఉంటే ప్రజల నిజమైన ఓటు హక్కు దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ పరిధిలో ఒకే వ్యక్తి పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఓటర్లుగా నమోదు కావడం వంటి అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టి అర్హతలేని ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అర్హులైన ఒక్క ఓటరు కూడా అనవసరంగా ఓటు హక్కు కోల్పోకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను క్షుణ్ణంగా నిర్వహించి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చర్యలు చేపట్టాలని గండ్ర వెంకట రమణా రెడ్డి కలెక్టర్‌ను కోరారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే లక్ష్యంగా తాను ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.