నర్సంపేట నియోజకవర్గ పర్యటనకు సీఎం
నర్సంపేట నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా నేను తెచ్చిన నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే మీ ప్రభుత్వం రద్దు చేసింది. గత రెండు సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయింది. రద్దు చేసిన అభివృద్ధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు .
గత ప్రభుత్వ హయాంలో శాసనసభ్యుడిగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విద్య, వైద్యం, సాగు, త్రాగు గ్రామీణ రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనలో చిత్తశుద్ధితో పనిచేసి అభివృద్ధి చేయడం జరిగింది. మరింత అభివృద్ధి కొనసాగింపులో భాగంగా వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి నిధులను నిల్వ ఉంచాను.గత రెండు సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే నిర్లక్షం,ప్రభుత్వ వైఖరి వలన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి చేయాలని నేను తెచ్చిన నిధులను మీ ప్రభుత్వం రద్దు చేసింది.ఆగిపోయిన అభివృద్ధి పనులను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.
రద్దు చేసిన అభివృద్ధి పనుల వివరాలు..
1) నర్సంపేట నియోజకవర్గంలోని 179 గ్రామ పంచాయితీలలో మరియు మున్సిపాలిటీలోని ఆరు వార్డులలో మహిళా సంఘాలకు శాశ్వత భవనాలకు నిధులు మంజూరు చేయడమైనది, ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని రద్దు చేశారు.
2) నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు సరిపడా నిధులు మంజూరు చేయడమైనది. నేడు ఆ నిధులను రద్దు చేశారు.
3) నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలను కలుపుతూ గ్రామాలకు తండాలకు అనుసంధానంగా నూతన బీటి రోడ్లను మంజూరు చేయడమైనది కొన్ని రోడ్లు మెటల్ నిర్మాణం కూడా పూర్తి చేసిన తర్వాత పై రోడ్లన్నింటిని రద్దు చేసినారు.
4) నర్సంపేట నియోజకవర్గం లో వివిధ గ్రామాలలో మండల కేంద్రాలలో గల మసీదులు చర్చిలు దేవాలయాల మరమ్మతులకు మరియు నూతన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసాము.వాటిని కూడా రద్దు చేశారు.
5) నియోజకవర్గంలోని అన్ని కులాల ఆత్మగౌరవ భవనాల మరియు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధుల మంజూరు ఇచ్చి, స్థలాలను కూడా గుర్తించడమైనది. 50 శాతం నిర్మాణాలు జరిగిన వాటినీ నిలిపివేశారు.
6) వ్యవసాయ యాంత్రికరణ కోసం పైలెట్ ప్రాజెక్ట్ గా ఆధునిక యంత్రాలను వ్యవసాయ పనిముట్లను రైతులకు 50 శాతం సబ్సిడీ పైన తక్కువ ధరకు అందే విధంగా 75 కోట్ల తో నిధులు మంజూరు చేసాము .ఇందులో 15 కోట్లు ఖర్చు ఇనవి. దీని ద్వారా 25 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారు ఈ పథకాన్ని కూడా రద్దు చేశారు.
7) హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేయడమైనది దీనికోసం నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 58 లో 54 ఎకరాల భూమి కేటాయించాము, దీనిలో ఎలాంటి పురోగతి లేదు.
8) మున్సిపాలిటీ లో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా 44 కోట్ల నిధులను నిలువ ఉంచాము రెండు సంవత్సరాలలో కేవలం 20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు మిగిలిన నిధులను ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
9) పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఐదు కోట్లతో ఆడిటోరియం సెంట్రల్ ఏసి నిర్మాణం 90% పనులు పూర్తి అయినవి 10 శాతం పనులను పెండింగ్లో పెట్టి రెండు సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు.
10) పట్టణ ప్రజల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాము ఇప్పుడు అది అర్ధాంతరంగా నిలిపివేశారు.
11) మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బాండ్ గా మార్చాలని ఎనిమిది కోట్ల నిధులు కేటాయిస్తే కేవలం మట్టి పనులను మాత్రమే చేసి బిల్లులను ఎత్తిన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మిగతా పనులను అసంపూర్తిగా వదిలేసినాడు.
12) నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలో ఏరియా హాస్పిటల్ నిర్మించాలని గత ప్రభుత్వంలో నిర్ణయం జరిగింది. తక్షణమే నెక్కొండలో ఏరియా హాస్పిటల్ నిర్మించాలి
13) గ్రామాలలో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో 59 పల్లె దావకానాలను ఇచినం అందులో 37 చోట్లా పూర్తికాగా,మరో 22 పల్లె దావకానాలను ఏర్పాటుకు కి అనుమతి ఇచ్చాము రెండు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
14) గత నెలలో వచ్చిన మె0థా తుఫానుతో రైతులు సర్వం కోల్పోయారు అధికారులు చేపట్టిన సర్వేలో నష్టాన్ని తక్కువ చూపించి రైతులకు నష్టం చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకు నష్టపరిహారం ఎకరాకు 25,000 ఇవ్వాలి.
15) అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ ,రైతు భరోసా పెంపు రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలు 420 హామీలలో భాగంగా మహిళలకు వృద్ధులకు రైతులకు యువకులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.
16) గోదావరి జలాలను పాకాల కి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేసి గత ఐదు సంవత్సరాలుగా రెండో పంటకు నీళ్లు ఇచ్చాము. కాల్వల మరమ్మత్తులకై 160 కోట్లతో అన్ని రకాల అనుమతులతో డిపిఆర్ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది వెంటనే మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు
పైన తెలిపిన అన్ని రకాల సమస్యలపై ఉమ్మడిగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధిని కొనసాగించాలని నర్సంపేట నియోజకవర్గం ప్రజల తరఫున కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ నల్ల మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, క్లస్టర్ బాధ్యులు కడారి కుమార స్వామి పాల్గొన్నారు.