నూతన రేషన్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) ఆదివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.అప్పయ్యపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన రేషన్ షాప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇకపై గ్రామ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమకు అవసరమైన నిత్యావసర సరుకులను సులభంగా పొందవచ్చన్నారు.పేద ప్రజలకు రేషన్ సరుకులు సకాలంలో,పారదర్శకంగా అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం అనంతరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పిల్లి రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.అలాగే గ్రామానికి చెందిన ఎల్లబోయిన ఎర్ర మల్లయ్య, అంబటి లక్ష్మీ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా,వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు.