నేడు భారత సైన్య దినోత్సవం – దేశ రక్షణలో వీర సైనికుల త్యాగం అమోఘం
భారత సైన్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 15న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మన దేశ భద్రత కోసం అహర్నిశలు సేవలందిస్తున్న వీర సైనికులకు కృతజ్ఞతలు తెలియజేసే ముఖ్యమైన రోజు. 1949 జనవరి 15న జనరల్ కె.ఎం. కరియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్యం అనంతరం భారతీయులే సైన్యానికి నాయకత్వం వహించడం దేశానికి గర్వకారణంగా మారింది.
భారత సైన్యం మన దేశ సరిహద్దులను కాపాడుతూ, శత్రు దాడుల నుంచి రక్షిస్తూ, అంతర్గత భద్రతను పరిరక్షిస్తోంది. హిమాలయాల మంచు పర్వతాల నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు, అడవుల నుంచి సముద్ర తీరాల వరకు ప్రతి ప్రాంతంలో సైనికులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తీవ్రమైన చలి, మండే ఎండ, వర్షాలు, మంచు తుఫాన్లు వంటి కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య కూడా వారు వెనకడుగు వేయకుండా దేశ భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సైనికుల జీవితం త్యాగాలతో నిండి ఉంటుంది. వారు తమ కుటుంబాలకు దూరంగా, ప్రాణాలకు ముప్పు ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తారు. మనమంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో సరిహద్దుల్లో సైనికులు తుపాకులతో కాపలాగా ఉంటారు. వారి సేవల వల్లే మనకు నిశ్చింతగా జీవించే అవకాశం లభిస్తోంది.
వారి పిల్లల పుట్టినరోజులు, పండుగలు, కుటుంబ ఆనందాలన్నింటినీ త్యాగం చేసి దేశ సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడపాల్సిన విలువైన క్షణాలను కూడా వదులుకుని దేశ భద్రత కోసం పని చేయడం సైనికుల గొప్ప త్యాగాన్ని చూపిస్తుంది. ఈ త్యాగాలకు సమాజం శిరసు వంచి గౌరవం ఇవ్వాలి.
1965, 1971, కార్గిల్ వంటి యుద్ధాల్లో భారత సైన్యం చూపిన వీరత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ముఖ్యంగా కార్గిల్ యుద్ధంలో మంచు పర్వతాల్లో తీవ్ర పరిస్థితుల మధ్య పోరాడి ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల త్యాగం దేశానికి ఎప్పటికీ గర్వకారణంగా ఉంటుంది. దేశ సరిహద్దుల భద్రత కోసం వారు చూపిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయి.
యుద్ధాలే కాకుండా వరదలు, భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో కూడా భారత సైన్యం ప్రజలను రక్షించేందుకు ముందుంటుంది. ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడం, ఆహారం, నీరు, వైద్య సహాయం అందించడం వంటి సేవలను సైనికులు నిస్వార్థంగా నిర్వహిస్తారు. ప్రాణాలకు ప్రమాదం ఉన్న పరిస్థితుల్లోనూ ప్రజలను కాపాడేందుకు ముందుకు రావడం వారి సేవాభావానికి నిదర్శనం.
ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా సైనికులు పని చేస్తారు. అందుకే వారిని నిజమైన “జీవిత రక్షకులు” అని పిలుస్తారు. దేశానికి అవసరమైన ప్రతీ సందర్భంలో ముందుండి సేవ చేయడం భారత సైన్య ప్రత్యేకత.
“సైనికుల రక్తమే మన జాతీయ జెండాకు రంగు” అనే మాటల్లోనే వారి త్యాగం దాగి ఉంది. వారి త్యాగాల వల్లే మనకు ఈ రోజు స్వేచ్ఛ, భద్రత, గౌరవం లభిస్తున్నాయి. సైనికులు లేకపోతే మన దేశం సురక్షితంగా ఉండదు అనే విషయం ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలి.
అందువల్ల ప్రతి భారతీయుడు సైనికులను గౌరవించాలి, వారి కుటుంబాలను ఆదరించాలి, దేశభక్తిని పెంపొందించుకోవాలి. వారి సేవలను గుర్తించి కృతజ్ఞతలు తెలియజేయడం మన బాధ్యత.
ఈ సందర్భంగా భారత సైనికుల సేవలను కొనియాడుతూ,
“జై జవాన్ – జై భారత్” నినాదంతో వారికి ఘన నివాళులు అర్పించాలి.
భారత సైన్యం మరింత శక్తివంతంగా, విజయవంతంగా దేశాన్ని కాపాడాలని ఆకాంక్షిస్తూ,
ఆర్మీ డే సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలి.
వ్యాసకర్త
వరిపల్లి అనిల్ కుమార్
రాష్ట్ర యువ నాయకులు,
రాజులకొత్తపల్లీ,
నెల్లికుదురు,
మహబూబాబాద్.