నేడే పోలింగ్-పోలింగ్ కు సర్వం సిద్ధం
హనుమకొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,కమలాపూర్ లోని మోడల్ స్కూల్ లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా గ్రామ పంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు,పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఆయా ఎంతమంది పోలింగ్ సిబ్బంది హాజరయ్యారని,ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారని,ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు ఎన్ని వాహనాలను ఏర్పాటు చేశారని,ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటుచేసిన భోజన సదుపాయాల గురించి కలెక్టర్ పరిశీలించి వివరాలను ఎంపీడీవోలు వీరేశం,బాబులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లను,హెల్ప్ డెస్క్ లను కలెక్టర్ పరిశీలించారు.పోలింగ్ సిబ్బంది కేటాయింపు,పోలింగ్ సామగ్రి పంపిణీని కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాల అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల వారీగా రూట్స్ అలాట్ చేసి జోనల్ రూట్ ఆఫీసర్లు సమన్వయంతో ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బందికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమవుతుందని,అందుకు సిబ్బంది ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పోలింగ్,కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సంప్రదించగా జిల్లా కలెక్టర్
మాట్లాడుతూ..జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా భీమదేవరపల్లి,ఎల్కతుర్తి,కమలాపూర్ మండలాల్లో గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలవుతుందని పేర్కొన్నారు.పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సిబ్బందికి శిక్షణను ఇచ్చామని తెలిపారు.గ్రామాలలో 90 శాతం ఓటర్లకు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామని,మిగతా పది శాతం ఇండ్లు షిఫ్ట్ అయిన వారు,చనిపోయిన వారు ఉన్నారని పేర్కొన్నారు.ఓటర్లకు ఓటు హక్కు పై అవగాహన కల్పించామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.జిల్లాలో గత గ్రామపంచాయతీ ఎన్నికలలో 85% ఓటింగ్ జరిగిందని,ఈ ఎన్నికలలో అంతకుమించి ఓటింగ్ శాతం పెరుగనుందన్నారు.జిల్లాలో ఓటర్లు తమ ఓటును ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా స్వయంగా వేస్తామని ముందుకు వస్తున్నారని,ఇది మంచి పరిణామమని అన్నారు.గ్రామాలలో ఎఫ్ ఎస్ టి,ఎస్ ఎస్ టి బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.హనుమకొండ జిల్లాలో మొదటి విడత మూడు మండలాలైన భీమదేవరపల్లి ఎల్కతుర్తి కమలాపూర్ మండలాల్లో 69 గ్రామపంచాయతీల గాను ఐదు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని,64 గ్రామపంచాయతీలకు,153 వార్డులు ఏకగ్రీవం కాగా 505 వార్డులకు గురువారం పోలింగ్ జరగనుందని తెలిపారు.ఎక్కువమంది ఓటర్లు ఉన్న పెద్ద గ్రామపంచాయతీలో పోలింగ్,కౌంటింగ్ నిర్వహణలో ఆలస్యం లేకుండా పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల సిబ్బందికి తెలియజేశామన్నారు.69 గ్రామ పంచాయతీలలో 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జడ్పీ సీఈవో రవి,భీమదేవరపల్లి,కమలాపూర్ తహసిల్దార్లు రాజేష్,సురేష్ కుమార్,ప్రత్యేకాధికారులు అనసూయ, నరసింహస్వామి,జోనల్,రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.