నోటీసులు లేకుండా కూల్చివేతలు
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలకు పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి అవినాష్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎంసిపిఐయు వరంగల్ నగర కార్యదర్శి మాలోతు సాగర్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.42వ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్లో నివసిస్తున్న పేదలపై టౌన్ ప్లానింగ్ అధికారి జులుం చూపుతున్నారని ఆయన మండిపడ్డారు.రోడ్డు మీదున్నాయనే నెపంతో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా జేసీబీ సహాయంతో ఇళ్లముందు ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లను ధ్వంసం చేశారని తెలిపారు.ఈ కూల్చివేతల కారణంగా రేకులు,ఐరన్ పైపులు,స్తంభాలు పూర్తిగా నష్టపోయాయని,దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యాయని చెప్పారు.అనుమతులు లేకుండా చెరువులు,కుంటల్లో పెద్దలు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులకు కనబడటం లేదని, కానీ పేదలు బ్రతుకు దెరువు కోసం చిన్నచిన్న టీ కొట్టులు,టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటే మాత్రం వారిపైనే అధికారులు ప్రతాపం చూపుతున్నారని సాగర్ తీవ్రంగా విమర్శించారు.ఈ అక్రమ కూల్చివేతలకు బాధ్యత వహించిన టౌన్ ప్లానింగ్ అధికారి అవినాష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ను అధికారికంగా కోరుతున్నట్లు తెలిపారు.అలాగే నష్టపోయిన బాధిత కుటుంబాలకు వెంటనే తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.