పరకాల పట్టణంలో తాయత్తుల మహిమ మోసం
పరకాల పట్టణంలో తాయత్తు మహిమ పేరిట అమాయక ప్రజల విశ్వాసాన్ని దోచుకునే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.“రూ.300కే 36 రకాల రోగాలు మాయం అవుతాయి”అంటూ మోసపూరిత ప్రచారం చేస్తూ ప్రతి బుధ,ఆదివారాల్లో వందలాది మంది ప్రజలను క్యూలైన్లలో నిలబెడుతున్నారు.వారానికి దాదాపు రూ.40 వేల వరకు,నెలకు సుమారు రూ.2 లక్షల వరకు వ్యాపారం సాగుతున్నా అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ప్రజల బలహీనతలే వ్యాపారానికి ఆధారం
పిల్లలు పుట్టకపోవడం,ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలను చూపుతూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.300-400 వసూలు చేస్తున్నారు.వారానికోసారి తప్పనిసరిగా రావాలని ఒత్తిడి చేసి నెలకు ఒక్కో కుటుంబం నుంచి రూ.2000 వరకు దండుకుంటున్నారు.తగ్గకపోతే పూజించిన నిమ్మకాయలు,సెంట్లు పేరుతో రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారు.
“దశాబ్దాలుగా కొనసాగుతున్న తతంగం”
హనుమకొండ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఈ వ్యాపారాన్ని 40-50 ఏళ్లుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.నన్ను ఎవరూ ఏం చేయలేరు అంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నా,స్థానిక నాయకులు,పోలీసులు మౌనం వహించడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది.
పరకాలలో ఇలాంటి బాబాలు మరెందరో
ఈ ఒక్క కుటుంబమే కాకుండా పరకాల పట్టణంలో ఇలాంటి దొంగ బాబాలు అనేక మంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వారు కూడా తాయత్తులు,నిమ్మకాయలు,సెంట్లు,పూజా పేర్లతో అమాయకుల జేబులు ఖాళీ చేస్తున్నారు.
“చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్”
మూఢనమ్మకాల ఆధారంగా ప్రజలను మోసం చేస్తుండగా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.“మరింత మంది అమాయకులు మోసపోకముందే తక్షణమే చర్యలు తీసుకోవాలి”అని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.