
పామునూరు గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
జనగామ జిల్లా,స్టేషన్ ఘనపూర్ మండలం పామునూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక రైతు కోట వాసు (42) పొలంలో కరెంట్ షాక్కు గురై దుర్మరణం పాలయ్యాడు.ఘటనకు సంబందించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం వాసు బ్రష్ చేసుకుని పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.పొలంలోని విద్యుత్ స్తంభంపై ఉన్న మూడు వైర్లలో ఒకటి తెగి నేరుగా పొలంలో పడింది.ఆ వైరు తెగి పడిన విషయాన్ని గమనించని రైతు వాసు పొలంలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తెగిపడిన విద్యుత్ వైరును వెంటనే సరిచేయకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తప్పక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మృతుడు కోట వాసుకు భార్య కోట కవిత (37),ఐదేళ్ల కుమారుడు నియాన్షు,వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కోట నారాయణ ఉన్నారు.కుటుంబ పోషణ అంతా వాసు మీదే ఆధారపడి ఉంది.ఈ హఠాత్ మరణంతో కుటుంబం రోడ్డున పడిందని,ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్థులు,స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.