పేదల ఇళ్ళు కూల్చివేతను ఖండించండి
ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను సిపిఐ (ఎం ) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వందలాది పేద కుటుంబాల ఇళ్లను భారీ పోలీసు బలగాలతో కూల్చివేయడం అమానుషమని పేర్కొన్నారు. నివాస హక్కు ప్రతి పౌరుడి మౌలిక హక్కు అని, ఆ హక్కును రక్షించాల్సిన ప్రభుత్వం పేదలను రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. పేదల ఇళ్ళు కూలగొట్టి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మంత్రి వింత ప్రకటన విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు గూడు లేకుండా చేయడమేనా? అని ప్రశ్నించారు. కూల్చిన ప్రతి ఇంటిని తిరిగి నిర్మించి ప్రజలకు అప్పజెప్పాలన్నారు. నిరాశ్రయులను చేసిన ప్రజలకు ప్రత్యామ్నాయ నివాస వసతి తక్షణమే కల్పించాలన్నారు. ధ్వంసం చేసిన ప్రజల సామాగ్రికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.