ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం
- గొత్తికొయగూడెంలో విస్తృత వైద్య శిబిరం – 52 మందికి ఉచిత వైద్య సేవలు, ఇంటింటా జ్వర సర్వే నిర్వహణ
- ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం – గర్భిణీల ఆరోగ్య పరీక్షలు, మలేరియా పరీక్షలు, పరిశుభ్రతపై వైద్య బృందం అవగాహన వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కొండాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. హెచ్. ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో గొత్తికొయగూడెంలో ప్రత్యేక వైద్య శిబిరంతో పాటు ఇంటింటా జ్వర (ఫీవర్) సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మొత్తం 52 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జ్వర లక్షణాలు ఉన్న ముగ్గురికి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ముగ్గురి నివేదికలు నెగెటివ్ వచ్చాయి. అలాగే గర్భిణీలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయడంతో పాటు ఆరోగ్య సంబంధిత సూచనలు చేశారు. వైద్య బృందం గ్రామస్తులకు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణ చర్యలు పాటించాలని, తాగునీటిని తప్పనిసరిగా కాచి తాగాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ భాస్కర్ రావు, ఏఎన్ఎమ్ సమ్మక్క, ఆశా కార్యకర్త లక్ష్మి పాల్గొని వైద్య శిబిరం, ఫీవర్ సర్వేను విజయవంతంగా నిర్వహించారు.