ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్రీడలు
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (సమగ్ర శిక్ష) ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కొరకు రాష్ట్రస్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఈ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనుటకు జిల్లా విద్యాశాఖ తరఫున బయలుదేరిన విద్యార్థుల బస్సును సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభను చాటుకుని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు.ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు.రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనుటకు వివిధ మండలాల నుండి మొత్తం 26 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు,7 మంది తల్లిదండ్రులు బయలుదేరారు.జిల్లా తరఫున పాల్గొంటున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లా గౌరవాన్ని నిలబెట్టాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్, జిల్లా సమీకృత విద్య కోఆర్డినేటర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ శ్యామల రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, మరియు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.