ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రికల్స్ వస్తువులు విక్రయం–ఆరుగురు అరెస్ట్,రూ.32 లక్షల వస్తువుల స్వాధీనం
Uncategorized #hanmakonda, #వరంగల్
ఈ69న్యూస్ వరంగల్, జూలై 18:
ట్రైసిటీ వరంగల్,హన్మకొండ,కేయూసీ పరిధిలో నకిలీ ఎలక్ట్రికల్ గృహోపకరణాల కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ విజయాన్ని సాధించారు.ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ కరెంటు వైర్లు,స్విచ్‌బోర్డులను విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను వరంగల్ టాస్క్‌ఫోర్స్,మట్టెవాడ,కేయూసీ,హనుమకొండ పోలీస్స్టేషన్ల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అరెస్ట్ చేశారు.ఈ దాడుల్లో మొత్తం రూ.32 లక్షల విలువైన నకిలీ ఎలక్ట్రికల్ గృహోపకరణాలు,7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ చేసిన నిందితులు పొనమారం చౌదరీ (30),రాజ్‌పురోహిత్ బీరుసింగ్ (60),కాంతిలాల్ (34),పురోహిత్ శ్రవణ్‌కుమార్ (28), పురోహిత్ భరత్‌కుమార్ (35),ఆమృత్ జైన్ (42) హనుమకొండ,వరంగల్,హైదరాబాద్ ప్రాంతాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
డీసీపీ షేక్ సలీమా తెలిపిన వివరాల ప్రకారం,నకిలీ వస్తువులు విక్రయిస్తున్న సమాచారం మేరకు మహేంద్ర ఎంటర్ప్రైజెస్ (వరంగల్), శ్రీఆర్ బుదా ఎలక్ట్రికల్స్ & సానిటరీ (హనుమాన్‌నగర్, హన్మకొండ),సాయి గణేష్ ఎలక్ట్రికల్స్ (కేయూసీ) షాపుల్లో ఒకేసారి దాడులు జరిపారు.ఈ దాడుల్లో మహేంద్ర ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.10.37 లక్షలు,శ్రీఆర్ బుదా ఎలక్ట్రికల్స్‌లో రూ.44 వేల,సాయి గణేష్ ఎలక్ట్రికల్స్‌లో రూ.20.70 లక్షల నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో పురోహిత్ భరత్‌కుమార్‌పై హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్టు,పొనమారం చౌదరీ,కాంతిలాల్లపై కేయూసీ,హనుమకొండ పోలీస్స్టేషన్లలో పాత కేసులు నమోదయ్యాయన్న సమాచారం అందింది.
డీసీపీ షేక్ సలీమా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ,నకిలీ ఉత్పత్తుల వలలో పడకుండా ఎలక్ట్రికల్ గృహోపకరణాలు అధికారిక షాపుల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు.ప్రజలకు అవగాహన కల్పించేందుకు కంపెనీలు తమ ఉత్పత్తుల వివరాలను మీడియా ద్వారా పంచుకోవాలని కూడా కోరారు.
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్,హనుమకొండ ఏసీపీ నర్సింహారావు,ఇన్స్పెక్టర్లు రవికుమార్,శివకుమార్,గొపి, ఏఎఓ సల్మాన్ పాషా,టాస్క్‌ఫోర్స్ సిబ్బంది భానుప్రకాశ్,రాజేశ్వరీ,ఉప్పలయ్య,కానిస్టేబుళ్లు సురేష్, సురేందర్,సాంబరాజు తదితరులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.