
ఈ69న్యూస్ హనుమకొండ: మత్తు కలిగించే హెచ్-1 ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాప్పై అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవల హనుమకొండ జిల్లాలోని ఓ ప్రాంతంలో కొంతమంది యువకులు మత్తు కలిగించే ఔషధాలను కొనుగోలు చేస్తూ మత్తుకు బానిసలవుతున్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలో యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఈ ఔషధాలను వరంగల్ ఎంజీఎం రోడ్డులో ఉన్న సిరి మెడికల్ షాప్ నుండి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో నార్కోటిక్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.డ్రగ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, శ్రవణ్ కుమార్ సదరు మెడికల్ షాప్లో తనిఖీలు నిర్వహించి, ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్-1 ఔషధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మత్తు కలిగించే హెచ్-1 ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.