ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై అవగాహన కార్యక్రమం
రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పై రేగొండ రైతువేదికలో శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి దృశ్య–శ్రవణ మాధ్యమం (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా పాల్గొని, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు యాప్ వినియోగంపై సమగ్ర శిక్షణ అందించారు.ముందుగా వ్యవసాయ శాఖ అధికారులు యాప్‌లో నమోదు విధానం, రైతుల వివరాల నమోదు, యూరియా బుకింగ్ ప్రక్రియపై అవగాహన పొందగా, అనంతరం ఎరువుల డీలర్లకు ప్రత్యేకంగా ఈ యాప్ వినియోగంపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,ఈ నెల 20వ తేదీ నుంచి రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో లాగిన్ అయి యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు తమ మొబైల్ నెంబర్ ద్వారా యాప్‌లో లాగిన్ అయి, తాము సాగు చేసిన పంట వివరాలను నమోదు చేసి యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సంబంధిత డీలర్ల వివరాలు స్పష్టంగా కనిపిస్తాయని, రైతులు తమకు సమీపంలోని డీలర్‌ను ఎంచుకుని యూరియా పొందవచ్చని వివరించారు.రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి విడతలవారీగా యూరియా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు ఒకే విడతలో యూరియా ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు రెండు విడతలలో ఐదు నుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతులకు మూడు విడతలలో యూరియా పంపిణీ చేస్తామని వెల్లడించారు.రైతు యాప్‌లో నమోదు చేసుకున్న వెంటనే ప్రత్యేక ఐడి సృష్టించబడుతుందని, దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం రైతు మొబైల్‌కు వస్తుందని అధికారులు తెలిపారు.ఆ ఐడితో పాటు రైతు ఆధార్ కార్డు జిరాక్స్, పట్టా పాస్ పుస్తకం కాపీ తీసుకుని సంబంధిత డీలర్‌ను సంప్రదించాలి. డీలర్ రైతు వివరాలను ధృవీకరించి, డీలర్ లాగిన్‌లో రైతు ఐడిని నమోదు చేసి, రైతు కోరుకున్న యూరియా బస్తాలను పంపిణీ చేస్తారని వివరించారు.ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా పట్టా పాస్ పుస్తకం కలిగిన రైతులతో పాటు కౌలు రైతులు కూడా నమోదు చేసుకుని యూరియా పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు.దీనివల్ల యూరియా దుర్వినియోగం అరికట్టి, అర్హులైన రైతులకు మాత్రమే ఎరువులు అందే అవకాశం కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో
సహాయ వ్యవసాయ సంచాలకులు భూపాలపల్లి ఎన్. రమేష్,మండల వ్యవసాయ అధికారి వాసుదేవ రెడ్డి,వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం.నాగరాజు,బి.గోవర్ధన్,ఎం. ప్రవళిక,ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.