బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
Jangaon, Telangana, TELUGU NEWSసమాజంలో ఇప్పటికీ పూర్తిగా నిర్మూలించబడని ప్రధాన సమస్యల్లో బాల్యవివాహం ఒకటి.చిన్నారుల బాల్యాన్ని హరించి,వారి చదువు,ఆరోగ్యం,భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే ఈ సమస్యను అరికట్టేందుకు స్కోప్ సంస్థ ఆధ్వర్యంలో ఘన్పూర్ స్టేషన్ గ్రామంలోని ఒయాసిస్ హై స్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాల్యవివాహ నిరోధక చట్టం 2006 గురించి వివరించారు.చిన్న వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల కలిగే చదువులో ఆటంకం,ఆరోగ్య సమస్యలు,మానసిక ఒత్తిడి,ముఖ్యంగా బాలికల భవిష్యత్తుపై పడే భారాలు గురించి అవగాహన కల్పించారు.స్కోప్ సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ వేముల అజిత్ కుమార్ మాట్లాడుతూ..ప్రతి చిన్నారికి సురక్షితమైన,ఆరోగ్యకరమైన బాల్యం హక్కు. ఎవరికైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098,పోలీస్ 100 లేదా స్కోప్ సంస్థకు తెలియజేయాలి.మౌనం కాకుండా స్పందించడం ఒకరి జీవితాన్ని రక్షించగలదు అని విద్యార్థులను ప్రోత్సహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెసర సతీష్ రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులలో అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని,చిన్నారులు తమ కుటుంబాల్లో,గ్రామాల్లో మార్పు తీసుకురాగల శక్తి ఉన్నవారని పేర్కొన్నారు.సదస్సులో ఉపాధ్యాయులు,సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.విద్యార్థులు బాల్యవివాహాలపై ప్రశ్నలు అడగగా,నిర్వాహకులు వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని ధైర్యం కల్పించారు.చివరగా విద్యార్థులంతా కలసి బాల్యవివాహాలకు నో అని ప్రతిజ్ఞ చేశారు.సమాజంలో పేదరికం,సంప్రదాయం,అవగాహన లోపం కారణంగా కొనసాగుతున్న ఈ సామాజిక చెడును అరికట్టేందుకు స్కోప్ వంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయం.పాఠశాలలు,ఉపాధ్యాయులు,విద్యార్థులు ముందుకు వస్తే ప్రతి చిన్నారికి స్వేచ్ఛ,విద్య,గౌరవంతో కూడిన బాల్యం లభించే రోజు దూరంలో లేదని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.