బిజెపి, బీ ఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు దేశ ప్రజలకు ప్రమాదకరం: సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్
Uncategorizedకేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజలకు ప్రమాదకరమని, ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే శాసనసభలో సిపిఎం ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలని అప్పుడే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అన్నారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సిపిఎం మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాలడుగు భాస్కర్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రాత్రి బహిరంగ సభ దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసరవెల్లి పార్టీలని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువస్తే ఢిల్లీని రైతులు దిగ్బంధనం చేసి విజయం సాధించారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఉపాధి హామీ పథకాలలో కేంద్ర ప్రభుత్వం 33 వేల కోట్లు కోత విధించింది అన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు కనీసం 150 కూడా రావటం లేదన్నారు. ఉపాధి హామీ కూలీలకు నిర్దిష్టంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. బిజెపి బీఆర్ఎస్ పెట్టుబడిదారుల, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. శాసనసభలలో సిపిఎం ఎమ్మెల్యేలు ఉంటే కార్మికుల కోసం, ప్రజల కోసం పోరాటాలు చేస్తారన్నారు. బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చి, మనువాదాన్ని అమలు చేయటానికి ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మారుస్తుందన్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా సిపిఎం, సిఐటియు మాత్రమే పోరాటం చేస్తుందన్నారు. మధిర నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క ఏనాడైనా ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నారా అని ఆమె ప్రజలను అడిగారు. ఉపాధి కూలీల పనుల వద్దకు ఏనాడైనా వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారా, అటువంటి ఎమ్మెల్యే మధిరకు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. అదే సిపిఎం ఎమ్మెల్యే ఉంటే ఉపాధి హామీ కూలీల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటారని వారి సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో పోరాటాలు చేస్తారన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి గ్యాస్ సిలిండర్ ద్వారా 400 రూపాయల మాత్రమే ఉందని ఆ తర్వాత బిజెపి ప్రభుత్వం 1100 రూపాయలకు పెంచిందన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి బిజెపి, బీ, కాంగ్రెస్ 400 రూపాయలకే గ్యాస్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నాయని, అంతకుముందు వారి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వటం లేదని ఆమె ప్రశ్నించారు. రాజకీయ ఊసర వెల్లులను ఈ ఎన్నికలలో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఊసరవెల్లులకు డబ్బులు కావాలని, ప్రజా సమస్యల కాదన్నారు. మధిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బోడేపూడి వెంకటేశ్వరరావు మధిర నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని అందించిన ఘనత సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్న బోడెపుడికే దక్కిందన్నారు. మధిర లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏనాడైనా ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నారా అని ప్రజలను అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపి విధానాలను అమలు చేస్తున్నాడని విమర్శించారు. బిజెపి బీఆర్ఎస్ ఒకటే నన్నారు. ప్రస్తుతం మనం రాజకీయ సవాలు ఎదుర్కొంటున్నామని, ఈ రాజకీయ సవాలను సిపిఎం ధైర్యంగా ఎదుర్కొంటుందన్నారు. మధిర నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి పాలడుగు భాస్కర్ పోరాట నాయకుడని, కార్మిక సంఘం నాయకుడని ఆయనను గెలిపించడం ద్వారా ప్రజా, కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న పాలడుగు భాస్కర్ ను గెలిపించి తెలంగాణ అసెంబ్లీకి పంపించాలని, అప్పుడే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయన్నారు. గతంలో శాసనసభలో సిపిఎం ఎమ్మెల్యేలు లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో, మధిర నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మీకేమైనా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారా అని సభకు హాజరైన మహిళలను ప్రశ్నించగా లేదు లేదు అంటూ సమాధానం చెప్పారు. దీంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇస్తే కేరళ ప్రభుత్వం ఏడున్నర లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించి పేద ప్రజలకు ఇస్తుందన్నారు. మీరు ఒక్కసారి కేరళ వస్తే స్వయంగా తాము చూపిస్తామన్నారు. కార్మిక శ్రామిక పేద ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ విధానాలను అవలంబిస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారానే మధిర నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్ ను గెలిపించి మధిర నియోజకవర్గ ప్రజల సత్తా చాటాలని కోరారు. బృందాకర ఇంగ్లీషులో మాట్లాడగ తెలుగులో సిఐటియు జాతీయ కోశాధికారి మండలపు సాయిబాబు అనువదించారు. బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు పోతినేని సుదర్శన్రావు రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు సిపిఎం మధుర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్ ఐలు రాష్ట్ర నాయకులు పార్థసారథి, ఏడు నూతల శ్రీనివాసరావు సిఐటియు రాష్ట్ర నాయకులు రాజారావు సిపిఎం మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.