బీజేపీ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించే కార్యక్రమం శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు.జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు పార్టీ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసమే ఈ ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఇది పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయిలో చేసిన నిరంతర కృషికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాదని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే కీలక బాధ్యత వహించాలని ఆమె సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేసే విధంగా పారదర్శకంగా అమలు చేయడంలో ముందుండాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సేవాభావంతో పనిచేస్తే రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ విజయం ఆరంభం మాత్రమేనని, గ్రామస్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని విజయం సాధించిన ప్రజాప్రతినిధులను కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న, చదువు రామచంద్రారెడ్డి, కన్నం యుగదీశ్వర్, పార్లమెంట్ కో–కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి, రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు రాయరాకుల మొగిలి, రాష్ట్ర నాయకులు బట్టు రవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, తాడికొండ రవి కిరణ్తో పాటు వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండలాధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.