బీసీ సర్పంచ్ అభ్యర్థికు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు గ్రామంలో బీసీ సర్పంచ్ అభ్యర్థి రామినేని తులసి రవీందర్ కు మద్దతుగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ గ్రామంలోని ప్రతి వీధిని సందడి చేసింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి గ్రామ ప్రజలు, యువత, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వాతావరణాన్ని వేడుకలా మార్చారు.సెంచరీకి చేరువైన బైకులు, పార్టీ జెండాలు, నినాదాలతో గ్రామం మొత్తం ఉత్సాహభరితంగా మారింది. బీసీ అభ్యర్థికి ఇంత భారీగా మద్దతు వెల్లువెత్తడం గ్రామ ప్రజల అభిలాష, అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా మాట్లాడిన టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్“తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం, బహుజనుల కోసం పుట్టిన పార్టీ టీఆర్పీ. బహుజనుల రాజ్యాధికారం సాధించడం మా ముఖ్య లక్ష్యం. అభ్యర్థుల గుర్తులు, పార్టీ జెండాలు పక్కన పెట్టి బీసీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి ఓటరు బాధ్యతతో పనిచేయాలి,” అని పిలుపునిచ్చారు.గొర్లవీడు గ్రామంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సమస్యలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని, బీసీ సర్పంచ్ అభ్యర్థి రవీందర్ రూపొందించిన మేనిఫెస్టో ఈ సమస్యలకు సమగ్ర పరిష్కార మార్గాలను చూపుతుందని రవి పటేల్ పేర్కొన్నారు. “అభివృద్ధి సాధ్యమయ్యే మేనిఫెస్టో ఇదే” అని ఆయన అన్నారు.అలాగే, “ఇది నా సొంత ఊరు. రవీందర్ గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం ఆయనతో కలిసి నేరుగా పనిచేస్తాను. గ్రామంలో కనిపించే ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు నా పూర్తి సహకారం ఉంటుంది” అని రవి పటేల్ హామీ ఇచ్చారు.ఈసారి గొర్లవీడు గ్రామ అభివృద్ధికి మార్గదర్శకుడయ్యే బీసీ అభ్యర్థిని గెలిపించడం సమయపాలిత అవసరమని, సర్పంచ్ అభ్యర్థి సబితా రవీందర్ గారి కత్తెర గుర్తుకే ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు. బీసీ వర్గానికి అండగా నిలబడి అత్యధిక మెజారిటీతో గెలిపించమని ఆయన గ్రామస్తులను అభ్యర్థించారు.గ్రామ ప్రజలు, ముఖ్యంగా యువతలో కనిపించిన ఉత్సాహం రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి భారీ మద్దతు లభించబోతోందని సూచిస్తోంది.