వరద నీటిలో వాహనాలు నడపొద్దని అధికారుల హెచ్చరిక!
- వాగులు, వంకలు ఉప్పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి!
- అత్యవసరం అయితేనే ప్రయాణించండి.. వరద నీటిలో వాహనాలు నడపొద్దని అధికారుల హెచ్చరిక!
తెలుగు గళం ఏటూరునాగారం:
గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా ఏటూరునాగారం–తుపాకులగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. సమీపంలోని వాగులు, వంకలు ఉప్పొంగడంతో రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వాహనాలు నిలిచిపోగా, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ప్రయాణాలు చేయవద్దని, ముఖ్యంగా వరద నీరు ప్రవహిస్తున్న రహదారులను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. నీటి లోతు అంచనా వేయలేని పరిస్థితుల్లో వాహనాలతో వెళ్లడం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాహనదారులు, ప్రయాణికులు పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరారు.