భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలి.
Uncategorized- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
తెలంగాణలో భూసర్వే జరిగి 70 సంవత్సరాలకుపైన అయిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు.
భూ భారతి చట్టం భూ సమస్యలను పరిస్కరిస్తుందా? అనే అంశంపై సెమినార్ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి అధ్యక్షతన ఆదిలాబాద్ పట్టణంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 70 లక్షల కుటుంబాలు భూసమస్యల పరిష్కారం కోసం ఎదురు చేస్తున్నాయని అన్నారు. భూముల ధరలు పెరగడంతో ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. కోర్టులలో వచ్చే కేసుల్లో భూ వివాదాలే అధికంగా ఉన్నాయని అన్నారు. రెవిన్యూ సదస్సులలో దాదాపు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో భూసర్వే జరిగి 70 సంవత్సరాలకుపైన అయిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని డిమాండ్ చేశారు. భూ భారతి రూల్స్ లలో సవరణలు చేయాలని కోరారు. సెక్షన్ 5, రూల్ 5 లో భూమి క్రయ, విక్రయాలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకోవడానికి ఒక సారి రిజిస్టీ కాకపోతే, రెండవసరి స్లాట్ బుక్ చేసుకోవడానికి రూ.500, మూడవసారి స్లాట్ చేస్తే రూ.1,000 ఫీజు చెల్లించాలని పొందుపరిచారు. అధికారులు చేసిన తప్పులకు రైతులు ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డులలో తప్పుల సవరణకు ప్రతి సవరణకు రూ.1,000 చొప్పున చెల్లించాలని చెప్పారు. 10 సవరణలకు రూ.10,000 కట్టాలని చెప్పడం సరైనది కాదని అన్నారు. గత ప్రభుత్వం ఇవే దరఖాస్తులకు రూ.1,650 చొప్పున 4.50 లక్షల మంది నుండి మీసేవా కేంద్రాలు దాదాపు రూ.74 కోట్లు వసూళ్లు చేసి ఒక్క రికార్డు సరిచేయలేదని గుర్తు చేశారు. రికార్డులు ఎవరు రాశారని అన్నారు.
సెక్షన్ 7, రూల్ 7 లో వారసత్వంగా వచ్చిన భూముల మ్యుటేషన్ కు భాగస్వాముల ‘వారసుల ఒప్పంద పత్రం’ / వీలునామా’ సరిపోతుందని భూ భారతి చట్టంలో చెప్పారు. మ్యుటేషన్ ఫీజు ఎకరాకు రూ.2,500 చెల్లించాలని పొందుపరిచారు. గతంలో ఎలాంటి ఫీజులు లేవని అన్నారు. పేరు, సర్వే నెంబర్, డిజిటల్ సంతకం సవరణకు భూమి మార్కెట్ విలువ రూ.5 లక్షలలోపు ఐతే ఆర్డీఓకు, రూ.5 లక్షలు దాటితే కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 10 గుంతల భూమికి మార్కెట్ విలువ రూ.5 లక్షలకు పైగా ఉందన్నారు. రెవెన్యూ కోర్టులు పునరుద్ధరిస్తున్నామని చెబుతూనే బాధ్యతలన్నీ కలెక్టర్ పైన పెడితే సమస్యల పరిష్కారం సాధ్యమా? అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాదాబైనామా పట్టాలు చేయడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ 9 వరకు ఆమోదించాలని అన్నారు. కాస్తుకాలం పునరుద్ధరించడానికి సెక్షన్ 10 లో సవరణ తేవాలని అన్నారు. 1971లోని సెక్షన్ 26ను తిరిగి పునరుద్ధరించాలి. వివిధ శాఖల కింద ఉన్న భూములను రెవెన్యూ శాఖ పరిధిలోకి తెచ్చి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొప్పని పద్మ మాట్లాడుతూ. .. భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమిని పంచాలని కోరారు. మహిళా, పురుషుల పేర్లపై జెయింట్ పట్టాలు ఇవ్వాలని అన్నారు. మహిళల పేర్లపై పట్టాలు ఇవ్వడం వలన సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు లంక రాఘవులు మాట్లాడుతూ.. పొడుభూములు సాగుచేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులు, వేదింపులు ఆపాలని అన్నారు. పేదలకు ఇండ్లు స్థలాలు ఇవ్వాలని అన్నారు. ఆదిలాబాద్లో మూతపడిన పరిశ్రమ భూములను సాగుచేసుకోవడానికి నిర్వాసితులకు అవకాశం ఇవ్వాలని అన్నారు. అభివృద్ధి పేరిట పేదల భూములు లాకోవద్దని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి స్వామి, కోచక్క, బి గంగారాం, ఆశన్న, సంతోష్, రామన్న, సీడం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.