మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు
పెండింగ్ వేతనాల చెల్లింపుకై ఈనెల 25న చలో కలెక్టరేట్
జీపి ఉద్యోగ కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు, పెండింగ్ వేతనాల చెల్లింపు తదితర డిమాండ్ల సాధనకై ఈనెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆన్లైన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా 52,000 మంది పంచాయతీ కార్మికులు గత ఎనిమిది సంవత్సరాలుగా మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు కోసం పోరాడుతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు.వేతనాలు పెంచకపోవడం, సకాలంలో చెల్లించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.గ్రామ సభల ద్వారా నియమించుకున్న పంచాయతీ కార్మికులను “అధనపు కార్మికులు” పేరుతో వివక్షకు గురిచేస్తూ, గత సంవత్సరం నుండి వేతనాలు నిలిపివేయడం అన్యాయమన్నారు.ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులను అక్రమంగా తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.ఆన్లైన్లో నమోదు కాని పంచాయతీ కార్మికుల వివరాలను వెంటనే నమోదు చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈనెల 25న నిర్వహించే “చలో కలెక్టరేట్” కార్యక్రమానికి అన్ని గ్రామ పంచాయతీల నుండి కార్మికులు భారీగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని రాపర్తి రాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వ రామచంద్రం, జిల్లా సీనియర్ నాయకులు మల్లాచారి, మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పగిడిపల్లి మల్లేష్, ఎన్. యాకన్న, సంగి కర్ణాకర్, టి. యాకూబ్, మహేందర్, ఉమ్మగోని రాజేష్, సత్యనారాయణ, జీడి ఆనందం, రతన్ సింగ్, కే. రాజు, జగన్, ఠాకుర్ వివేక్ సింగ్, కుక్కల సోమన్న, నారోజు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు