
మహిళా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి
– హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
ఈ69 న్యూస్ | హనుమకొండ | మార్చి 07
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హనుమకొండలో నిర్వహించే కార్యక్రమాలకు అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు.
శనివారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా శక్తిని ప్రతిబింబించే విధంగా వివిధ కార్యక్రమాలను రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సోమవారం (09-03-2026) సాయంత్రం నాలుగు గంటల నుంచి హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రత్యేక మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. హనుమకొండతో పాటు జిడబ్ల్యూఎంసీ పరిధిలోని మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మహిళలతో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీఆర్డీఏ, మెప్మా శాఖలు సమన్వయంతో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమానికి మహిళలు, ఆర్పీలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే వేదిక అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, తాగునీరు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమానికి వీఐపీలు, మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్టీవో రాథోడ్ రమేష్, కుడా సీపీవో అజిత్ రెడ్డి, డీఆర్డీవో మేన శ్రీను, మెప్మా పీడీ జోనా, ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, డిడబ్ల్యూఓ విశ్వజ, తహసిల్దార్ రవీందర్ రెడ్డి, షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత, మెప్మా కోఆర్డినేటర్ రజిత రాణి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.