మినిట్ టు మినిట్ ప్రణాళిక సిద్ధం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమానికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు మరియు ఈ నెల 12న నిర్వహించనున్న మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలనను మరింత ప్రజలకు చేరువ చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం కోసం స్థానిక ప్రజా ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమానికి సంబంధించి విభాగాల వారీగా పూర్తి స్థాయి మినిట్ టు మినిట్ ప్రణాళికను సిద్ధం చేసి సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రతిరోజూ సమీక్షిస్తూ మున్సిపల్ అధికారులు మరియు జిల్లా పంచాయతీ అధికారుల నుండి రోజువారీ నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, పరిశుభ్రత మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.