మోడీ పాలనలో దేశానికి ప్రమాదం
- ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే బాధ్యత కమ్యూనిస్టులదే..
- కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది
- దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోనూ ప్రమాదం
- ఖమ్మం బోసు బొమ్మ సెంటర్లో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ… బహిరంగ సభలో సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
- యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ సందర్భంగా త్రీ టౌన్ లో రెడ్ షర్ట్స్ అండ్ శారీస్ ధరించి ‘యర్రా’ కవాత్
- మోడీ పాలనలో దేశానికి ప్రమాదం ఏర్పడిందని సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ప్రమాదం ఏర్పడింది అని తెలిపారు. మహిళలు, దళితులు, మైనార్టీల పరిస్థితి ప్రమాదకర స్థితికి చేరిందన్నారు. దేశం ఇన్ని ప్రమాదాల మధ్య నలుగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టులు ప్రజల మధ్యన పనిచేస్తూ… ప్రజలను మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజలను అంటిపెట్టుకొని పని చేసే వారే నిజమైన కమ్యూనిస్టులని పేర్కొన్నారు. అటువంటి వారిలో ఒకరు యర్రా శ్రీకాంత్ అని చెప్పారు. శ్రీకాంత్ స్ఫూర్తితో ప్రజాతంత్ర ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన స్థానిక బోసుబొమ్మ సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ బహిరంగ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం దివాళా తీయిస్తోందని అన్నారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి… దిగుమతి సుంకం లేకుండా అమెరికా నుంచి వివిధ పంట ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని తెలిపారు. ఇటువంటి చర్యలను వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో రీచార్జీ చేయకపోతే కరెంటు కట్ అవుతుందని హెచ్చరించారు.
- ప్రజా జీవనంలో అన్ని పార్శ్వాలను కమ్యూనిస్టులు స్పృశించాలి..
- కమ్యూనిస్టులపై నమ్మకం కుదరాలంటే ప్రజా జీవనంలోని అన్ని పార్శ్వాలను స్పృశించాలని రాఘవులు సూచించారు. అలా పని చేశారు కాబట్టే శ్రీకాంత్ ప్రజల మనస్సులో చిరస్థాయిగా… మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. బూర్జువా పార్టీలు రకరకాల రూపాల్లో ప్రజలను ఆకర్షిస్తాయని, కులమత భావాలను రెచ్చగొట్టడమే కాకుండా… అవసరమైతే మోడీ లాగా దౌర్జన్యాలకు దిగైనా ప్రజలను తమ మార్గంలోకి తెచ్చుకుంటాయని చెప్పారు. కమ్యూనిస్టులు ప్రజల్లో ఉండి ఇటువంటి వాటిని తిప్పి కొట్టాలని, ప్రజా మార్గం పట్టాలని పిలుపునిచ్చారు. అలా పని చేశారు కాబట్టే శ్రీకాంత్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు.
- దేశానికి ట్రంప్ ప్రమాదం
దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రమాదం పొంచి ఉందని రాఘవులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దిగుమతి సుంకం లేకుండా పంట ఉత్పత్తులను దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కోడి కాళ్లు, సోయాబీన్, మొక్కజొన్నలు, పాల ఉత్పత్తులు, మిర్చి, పసుపు తదితర అమెరికా పంట ఉత్పత్తులను దేశం దిగుమతి చేసుకోవడం ద్వారా పౌల్ట్రీ, డెయిరీ రంగాలు దివాళా తీస్తాయన్నారు. 38 శాతం గా ఉన్న పాడి రైతులతో పాటు కౌలు రైతులు తీవ్రంగా దెబ్బతింటారని హెచ్చరించారు. - 24న ‘ఉపాధి’ చట్టం రద్దుకు వ్యతిరేకంగా ర్యాలీ
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దును వ్యతిరేకిస్తూ మార్చి 24న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించనున్నట్లు రాఘవులు తెలిపారు. దేశంలో వైషమ్యాలు సృష్టించే కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాంటి పోరాటాలను నిర్మించారు కాబట్టే శ్రీకాంత్ చిరస్మరణీయునిగా నిలిచారని అన్నారు.
- సీపీఐ (ఎం) పోరాట ఫలితంగానే పేదలకు ఇండ్ల పట్టాలు
సీపీఐ (ఎం) పోరాట ఫలితంగానే ఖమ్మంలోని 6,670 మంది పేదలకు ఇండ్ల పట్టాలు వచ్చాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోరాటంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. త్రీ టౌన్ పరిరక్షణ కమిటీకి నేతృత్వం వహించారని, ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం తపించారని అన్నారు. భూదాన్ భూముల్లో పదేండ్లుగా పేదలు ఉంటుంటే ఏమి చేశారని? ఇప్పుడు ఇండ్లను కూల్చడం ఏంటి అని ప్రశ్నించారు. శ్రీకాంత్ వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్న నేత అని కొనియాడారు. బోసు బొమ్మ సెంటర్ భవిష్యత్తులో శ్రీకాంత్ సెంటర్ గానూ మారాలని ఆకాంక్షించారు. - ‘యర్రా’ కవాత్..
శ్రీకాంత్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఖమ్మం గాంధీచౌక్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు రెడ్ షర్ట్స్, శారీస్ ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మనవళ్లు ప్రదర్శించిన కర్ర సాము ఆకట్టుకుంది. సెంటర్ లో ఏర్పాటుచేసిన శ్రీకాంత్ విగ్రహాన్ని బీవీ రాఘవులు ఆవిష్కరించారు. శ్రీకాంత్ ను అంతిమ గడియల నుంచి కాపాడేందుకు యఙత్నించిన వారిలో ఒకరైన మధురై ఎంపీ వెంకటేష్ ఈ వైగ్రహావిష్కరణకు రావాల్సి ఉందని, మార్చి నెలలో ఆరు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోనూ ఎలక్షన్స్ జరుగుతున్న దృష్ట్యా ఆయన రాలేకపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మాదినేని రమేష్, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, పి. సోమయ్య, ఎం.సుబ్బారావు, చింతలచెరువు కోటేశ్వరరావు, సత్తుపల్లి, మధిర డివిజన్ కార్యదర్శులు శీలం సత్యనారాయణ రెడ్డి, మడుపల్లి గోపాల్ రావు, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, శ్రీకాంత్ సతీమణి యర్రా సుకన్య తదితరులు పాల్గొన్నారు.