యూకేలో విజయవంతంగా ముగిసిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ 59వ అంతర్జాతీయ జల్సా సాలానా
Uncategorizedహదీకతుల్ మహ్దీలో అద్భుతమైన శాంతియుత వాతావరణం

ఈ69న్యూస్ లండన్,జూలై 27
యునైటెడ్ కింగ్డమ్ అహ్మదీయ ముస్లిం సంఘం ఆధ్వర్యంలో హాంప్షైర్ రాష్ట్రం ఆల్టన్ సమీపంలోని హదీకతుల్ మహ్ది ప్రాంగణంలో మూడు రోజుల పాటు (జులై 26 నుంచి 28 వరకూ) అద్భుతంగా నిర్వహించబడిన 59వ జల్సా సాలానా UK ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది.ఈ మహాసభలో ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా దేశాల నుండి సుమారు 46,000 మంది అహ్మదీయ ముస్లిం ప్రతినిధులు హాజరయ్యారు.ప్రపంచ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ అధిపతి,ఖలీఫతుల్ మసీహ్ వ్హజరత్ మీర్జా మస్రూర్ అహ్మద్ (అయ్యదహుల్లాహు తా’ఆలా బి నస్రిహిల్ అజీజ్) ఈ మూడు రోజుల పాటు తమ ప్రభావశీలమైన ప్రసంగాలతో కార్యక్రమానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం కలిగించారు.మొదటి రోజు అహ్మదీయ జెండా మరియు యూకే జాతీయ పతాకాలు ఎగురవేసే కార్యక్రమంతో జల్సా ఘనంగా ప్రారంభమైంది.ప్రస్తుత దైవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్,తక్వా (ధార్మిక నైతికత), ఆత్మవిశ్వాసం, నిజాయితీ మరియు ఇస్లాం యొక్క శాంతియుత సందేశంపై మౌలిక ఉపదేశాలు ఇచ్చారు.ఈ ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా MTA ఇంటర్నేషనల్ చానెల్ ద్వారా వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. రాజకీయ నాయకులు, మేధావులు, మత పండితులు ఈ జల్సాలో పాల్గొని మత సామరస్యానికి మద్దతుగా తమ సందేశాలు పంపించారు.ఈ జల్సా కోసం ఏర్పాటైన 208 ఎకరాల ప్రాంగణం తాత్కాలికంగా ఒక పట్టణంలా ముస్తాబైంది. ట్రాఫిక్, భద్రత, ఆరోగ్యం, ఆహార వసతులు తదితర విభాగాల్లో సుమారు 2,500 మంది వాలంటీర్లు నిర్విరామంగా సేవలు అందించారు. యువత, వృద్ధులు,మహిళలు-వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఒకే ఉద్దేశంతో పని చేశారు.అతిథి సేవ మరియు శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడం.ఇందులో భాగంగా ‘బ్రెడ్ ఫర్ బ్రిటన్’ సేవా కార్యక్రమం నిర్వహించబడింది. వేలాది రొట్టెలు (రొటీ) తయారుచేసి యూకేలోని ఫుడ్ బ్యాంకులకు పంపిణీ చేయడం ద్వారా సామాజిక బాధ్యతను చాటారు.తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి హాజరైన ప్రతినిధి జైనుల్ ఆబిదీన్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం మాకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది. ఖలీఫా మార్గదర్శనం, వాలంటీర్ల సేవా నిబద్ధత, అతిథి సత్కారం అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవిగా ఉన్నాయి.ముగింపు సభలో ఖలీఫా మస్రూర్ అహ్మద్ ప్రపంచ శాంతికి ప్రతి అహ్మదీయ ముస్లింకు పాత్ర ఉంది అని హితవు పలికారు. మతం పేరుతో జరుగుతున్న అసహనానికి ప్రత్యామ్నాయం ఇస్లాం యొక్క నిజమైన శాంతియుత సందేశమే అని పునరుద్ఘాటించారు.