
రబ్వా అహ్మదీయ మస్జిద్‌పై ఉగ్రదాడి
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న రబ్వా పట్టణంలోని బైతుల్ మహ్దీ మస్జిద్ వద్ద శుక్రవారం నాడు జరిగిన ఉగ్రదాడిలో పలువురు అహ్మదీయ ముస్లింలు గాయపడ్డారు.ఒక సాయుధ దుండగుడు మస్జిద్ వెలుపల విధుల్లో ఉన్న అహ్మదీయ స్వచ్ఛంద సేవకులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు.ఈ దాడిలో ఐదుగురు గాయపడగా,అందులో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం.భద్రతా సిబ్బంది సమయానికి స్పందించి ఉగ్రవాదిని మస్జిద్లోకి ప్రవేశించేలోపు అడ్డుకుని కాల్చి చంపారు.ఈ ఘటనపై ప్రపంచ అహ్మదీయ ముస్లిం సంఘం అధినేత హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన గాయపడిన భక్తుల ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని,ప్రజల రక్షణను నిర్ధారించాలని కోరారు.హజ్రత్ ఖలీఫతుల్ మసీహ్ తన సందేశంలో పేర్కొన్నారు.శుక్రవారం రోజు రబ్వాలో గోల్ బజార్ ప్రాంతంలోని బైతుల్ మహ్దీ మస్జిద్ వద్ద ఉగ్రదాడి జరిగింది.ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులు గాయపడ్డారు.అందులో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది.అల్లాహ్ వారికి త్వరగా ఆరోగ్యం ప్రసాదించుగాక.ఉగ్రవాది మా భద్రతా సిబ్బంది చేతిలో హతమయ్యాడు.అలాగే ఆయన పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అన్నారు.ప్రభుత్వం నేరాలను పూర్తిగా అదుపులో ఉంచామని చెబుతోంది.అయితే అహ్మదీయులపై జరుగుతున్న దాడులు,హత్యలు,ఆస్తుల దహనం-ఇవి నేరాలుగా పరిగణించబడడంలేదు.అల్లాహ్ వారికి జ్ఞానం ప్రసాదించుగాక మరియు త్వరలోనే అహ్మదీయ సమాజం కోసం తన సంకేతాలను ప్రదర్శించుగాక.ఈ దాడి పాకిస్తాన్లో అహ్మదీయ ముస్లింలపై కొనసాగుతున్న వివక్ష,మతపరమైన అసహనం,మరియు హింసాత్మక చర్యల నేపథ్యంలో మరో విషాద ఘట్టంగా నిలిచింది.పాకిస్తాన్లో అమలులో ఉన్న వివక్షాత్మక చట్టాల కారణంగా అహ్మదీయులు తమను ముస్లింలుగా ప్రకటించుకోవడానికీ,విశ్వాసాన్ని బహిరంగంగా ఆచరించడానికీ చట్టపరంగా నిషేధించబడ్డారు.తన శుక్రవారం ఉపన్యాసంలో హజ్రత్ ఖలీఫతుల్ మసీహ్ పవిత్ర ప్రవక్త మహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)కరుణ,శాంతి,మరియు క్షమా గుణాలను స్మరించారు.ఆయన జీవితంలో ఉన్న శాంతి,దయ,మరియు మానవతా విలువలను ప్రతి అహ్మదీయుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆచరించాలని పిలుపునిచ్చారు.రబ్వా పట్టణం పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో అహ్మదీయ ముస్లిం సంఘం ప్రధాన కేంద్రంగా ఉంది