రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా డాక్టర్ గడ్డం వెంకన్న ఎంపిక
Hyderabad, Telangana, TELUGU NEWSసురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం జాబితాను ప్రకటించింది.గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళావేదికలో జరిగే వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకోనున్నారు.డాక్టర్ గడ్డం వెంకన్నకు 30 ఏళ్ల పరిశోధన అనుభవం,15 ఏళ్ల బోధన అనుభవం ఉంది.‘పటం కథలు-కథకులు’ అనే అంశంపై పరిశోధన చేసి గ్రంథాన్ని వెలువరించారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేక జిల్లాల్లో పర్యటించి జానపద,గిరిజన విజ్ఞానంపై 20కి పైగా పుస్తకాలు రచించారు.జాతీయ,అంతర్జాతీయ పత్రికలు,జర్నల్స్, పుస్తకాలలో 70 వ్యాసాలు ప్రచురించబడ్డాయి.వివిధ జాతీయ సదస్సుల్లో 50 పత్రాలను సమర్పించారు.ఆయన పర్యవేక్షణలో 6 మంది పీహెచ్డీ,3 మంది ఎంఫిల్ విద్యార్థులు పరిశోధనలు పూర్తి చేశారు.జానపద కళా రూపాలను ఆడియో,వీడియో,ఫోటో రూపాల్లో డాక్యుమెంటేషన్ చేయడం ద్వారా అరుదైన కళారూపాలను సంరక్షించడంలో వెంకన్న విశేష పాత్ర పోషించారు.రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ స్థాయి కలోత్సవాల్లో ఆయన చేసిన కృషి విశేషం.తెలుగు విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, చిత్రవాణి ఇన్చార్జ్ డైరెక్టర్,డిజైన్ విభాగాధిపతి,జానపద కళల శాఖాధిపతి,వరంగల్ జానపద విజ్ఞాన అధ్యయన విభాగాధిపతి వంటి పలు బాధ్యతలు నిర్వర్తించారు.అంతేకాదు,ఫోజిల్స్ (Folklore Society of South Indian Languages),సాహిత్య పీఠం రాజమండ్రి వంటి సంస్థల్లోనూ కీలక స్థానాల్లో పనిచేశారు.గతంలో లయన్స్ క్లబ్ ఆఫ్ థౌసండ్ పిల్లర్స్,రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ, తెలుగు భాషోద్యమ సమాఖ్య వారిచే కూడా ఉత్తమ అధ్యాపక పురస్కారాలు అందుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ వెంకన్న విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు,రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు,పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.జానపద గిరిజన విజ్ఞాన పీఠం సిబ్బంది,సహచరులు ఆయనను అభినందించారు.