రేగొండలో ప్రజా సంగమ యాత్రకు ప్రజల భారీ స్పందన
రేగొండ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొలెపాక వజ్ర–బిక్షపతి ప్రజా సంగమ యాత్రను ప్రబలంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల వేళ ఇంటింటి ప్రచారాన్ని మరింత వేగవంతం చేసిన ఆయన ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, గ్రామంలో ఎదురవుతున్న ఇబ్బందులు సమగ్రంగా తెలుసుకుంటున్నారు. ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, వారు చెప్పే ప్రతీ విషయాన్ని శ్రద్ధగా విని ప్రజలతో అనుబంధం పెంచుకుంటున్నారు.
గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న వజ్ర–బిక్షపతి, రేగొండను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, శుద్ధమైన తాగునీటి సరఫరా, స్ట్రీట్ లైట్లు, కాలువల సదుపాయం, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, కోతులు–కుక్కల బెడద నివారణ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటానని తెలిపారు. తాను సొంతంగా ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు రేగొండ గ్రామపంచాయతీ కోసం తన కొడుకు ద్వారా సమకూర్చుకొని ప్రజల కోసం ఖర్చు పెడతానని ఆయన ప్రజలకు మాటను ఇచ్చారు.ప్రజా సంగమ యాత్రకు గ్రామ ప్రజలు విపరీతమైన స్వాగతం పలుకుతుండటంతో ప్రచారం మరింత వేగంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధిని అందించగల నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ కత్తెర గుర్తుకు తమ విలువైన ఓటును ఉపయోగించాలని వజ్ర–బిక్షపతి ప్రజలను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి బలమైన నాయకత్వం అనివార్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తెలుసని, అదే ప్రజా సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుదల చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.అయన మాట్లాడుతూ,
“ప్రభుత్వం ప్రజలకు చూపిన ఆరు గ్యారంటీలన్నీ ఫలితం లేకుండా పోయాయి. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు… కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారు. అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది” అని ధ్వజమెత్తారు.
గ్రామస్థాయిలోనే ప్రజలు తమ ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, గ్రామాభివృద్ధి కోసం బీక్షపతిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రచార యాత్రలో స్థానిక నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామస్తులు భారీగా పాల్గొని వజ్ర–బిక్షపతికి తమ మద్దతు ప్రకటించారు.