రైతులకిచ్చిన హామీలు అమలుచేయడంలో విఫలం
Hyderabadఏడాది పాటు దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చేసిన పోరాట ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శించారు. కామారెడ్డి స్థానిక వశిష్ట విద్యా సంస్థ లో తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి డి మోతిరామ్ నాయక్ అధ్యక్షతన జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు బడ్జెట్ లో నిధులు పెంచాలని కోరారు. విత్తనాలు, ఎరువులు, విద్యుత్ వంటి వాటికి సబ్సిడీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రైతు పండించిన అన్ని రకాల పంటకు ఎంఎస్.స్వామినాథన్ సిఫారసు ప్రకారం పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టబద్దం చేయాలన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రటిష్ట చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఫసలీబీమా యోజన పథకాన్ని సవరించి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని కోరారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు, వరదలు పంట సంబంధిత వ్యాధుల వలన పంట పొలాలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అన్ని పంటలకు బీమాపథకం అందించాలన్నారు. అన్ని వ్యవసాయ కుటుంబాలను అప్పుల ఊబి నుండి విముక్తి చేయడానికి సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మకమైన రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రైతాంగానికి ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయాలన్నారు. నాలుగు లేబర్కోడ్లను రద్దు చేసుకొని తమ హక్కులను సాధించుకునేందుకు ఉద్యమించాలన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
సంయుక్త కిసాన్ మోర్చా జిల్లాకమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి మోతిరామ్ నాయక్, అఖిల భారత ప్రగతిశీల రైతు కూలి సంఘం గొల్ల పరమేష్, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ నర్సయ్య, ప్రకాష్, కమ్మరి సాయిలు, పిడుగు నర్సింలు, రోజా, లాష్మినరయన, సావిత్రి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.