రైతులకు యూరియా కొరత రావడానికి వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ,స్థానిక స్థాయిలో డిఎఓ,ఎంఎఓ,ఎఇఓ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి యూరియా సరైన వినియోగంపై అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన సూచించారు.ముఖ్యంగా నానో స్ప్రే యూరియా వినియోగం గురించి రైతులకు తెలియజేసి శిక్షణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఒక ఎకరానికి 50 కిలోల యూరియా చాలు అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నప్పటికీ,కొంతమంది రైతులు రెండు మూడు బస్తాలు వాడటం వల్ల పంటల పెరుగుదల ఉన్నా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని శ్రీహరి గుర్తుచేశారు.రైతుల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని,యూరియా సరఫరా సమయానికి జరిగేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.