స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ శివునిపల్లి ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు,కార్డియాక్ అరెస్ట్లు,బైపాస్ సర్జరీలు,స్టంట్లు వేయించుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో,గుండె సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ క్యాంప్ జనవరి 13(మంగళవారం) ఉదయం 10 గంటల నుండి శివునిపల్లి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ (బాలురు)లో నిర్వహించబడుతుంది.ఈ సందర్భంగా మెడికోవర్ హాస్పిటల్,వరంగల్ వైద్య నిపుణులు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి,భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను గుర్తించి అవసరమైన సూచనలు,సలహాలు అందిస్తారు.అలాగే ఆర్థోపెడిక్ వైద్యులు ఎముకల సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తారు.జనరల్ ఫిజీషియన్ ద్వారా ఇతర సాధారణ వ్యాధుల పరిశీలన కూడా చేపడతారు.అదేవిధంగా న్యూట్రిషన్ హెల్త్ సెంటర్ నిపుణులు అధిక బరువు,శరీరంలోని కొవ్వు శాతం,చర్మం కింద కొవ్వు శాతం,బాడీ మెటబాలిజం,శరీరంలో ఉన్న వ్యర్థ జలాలపై బాడీ స్కానింగ్ చేసి,వాటిని నియంత్రించుకునే విధానాలపై తగిన సూచనలు అందిస్తారు.శరత్ మాక్స్ ఐ హాస్పిటల్,హనుమకొండ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించబడతాయి.స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ నాయకులు కోరారు.గ్రామ పెద్దలు,యువకులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.