వలలో చిక్కుకుని యువకుడు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనపర్తి గ్రామంలో ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది.చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.గ్రామానికి చెందిన మునిగాల రాజు (30)అనే యువకుడు వృత్తిరీత్యా కులవృత్తి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన తండ్రి పేరు నరసయ్య,కులం ముదిరాజు, భార్య మునిగాల అనూష (26), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఉదయం తన కులవృత్తిలో భాగంగా చేపలు పట్టేందుకు వెళ్లిన రాజు,చలివాగు ప్రాంతంలో వల వేసే సమయంలో ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నెటిలో మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది.కొంతసేపటికి స్పందన లేకపోవడంతో స్థానికులు గమనించి సమాచారం అందించగా, అప్పటికే రాజు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది.ఈ ఘటనపై మృతుని భార్య మునిగాల అనూష రేగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రేగొండ ఎస్సై కె. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.యువ వయసులోనే రాజు మృతి చెందడం గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇద్దరు చిన్నారులతో ఉన్న కుటుంబానికి తండ్రిని కోల్పోవడం హృదయవిదారకమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించాలని పలువురు కోరుతున్నారు.