వాకింగ్ చేస్తుండగా విద్యార్థి మృతి-కరుణాపురం బీసీ హాస్టల్లో విషాదం
Uncategorized
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ హన్మకొండ:జనగామ జిల్లా స్టేషన్
ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని బీసీ వెల్ఫేర్ తెలంగాణ జ్యోతీ భా పూలే రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆకస్మిక మృతి విషాదాన్ని మిగిల్చింది.ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బత్తిని మణితేజ (తండ్రి పేరు కుమార స్వామి),హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందినవాడు.వివరాల్లోకి వెళ్తే,మణితేజ సోమవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో హాస్టల్ ప్రాంగణంలో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు.ఈ దృశ్యం గమనించిన పిఈటి ఉపాధ్యాయులు ఇద్దరు రాజులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.తక్షణమే వరంగల్ ఎంజిఎం ప్రభుత్వాసుపత్రికి తరలించగా,అక్కడ వైద్యులు విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.ఈ విషయాన్ని డిసివో ఆకుల శ్రీనివాస్,స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేముల శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.మణితేజ మృతితో హాస్టల్లోని విద్యార్థులు,ఉపాధ్యాయులు,అతడి కుటుంబ సభ్యులు,బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.విద్యార్థి ఇంత చిన్న వయసులోనే ఇలా ఆకస్మికంగా కన్నుమూయడం అందరినీ కలచివేసింది.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.ఘటనపై మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ధర్మసాగర్ పోలీస్ లు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని మీడియాకు వెల్లడించారు.