విత్తనం నష్టపోయిన రైతులకు రూ.20వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి-భూక్యా చందు నాయక్
Uncategorized
ఈ69న్యూస్ జనగామ:-జనగామ జిల్లా వ్యాప్తంగా సాగునీటి కొరత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో,జనగామ జిల్లాలోని చెరువులు,కుంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. గోదావరి వరద ఉధృతిని సముద్రంలో వృథాగా వదిలేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ,దేవాదుల ప్రాజెక్టు ద్వారా జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లా రిజర్వాయర్లు, చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ఆధ్వర్యంలో జూలై 18,19 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా షామీర్పేట మండలంలోని ఊరకుంట చెరువు,కర్రె సత్తయ్య అనే రైతు పొలాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.చెరువులు,బోర్లు పూర్తిగా ఎండిపోయి,పంటలు నాశనమైన రైతులకు రూ.20,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఇప్పటికే పత్తి విత్తనాలు రెండు మూడుసార్లు వేసినప్పటికీ వర్షాభావం వల్ల విత్తనాలన్నీ వేస్ట్ అయ్యాయని, వరినారు వేసినవారికి కూడా నీటి లేమితో నారుమడి ఎండిపోయినదని తెలిపారు.
గత వారం రోజులుగా గోదావరిలో వరద నీరు పెరిగినా ప్రభుత్వం పూర్తిస్థాయిలో లిఫ్టింగ్ చేపట్టలేదని, అధికారులు చెప్పే మాటలు ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జిల్లాలోని 9 రిజర్వాయర్లు, 723 చెరువులు నింపితే భూగర్భ జలాల పరిరక్షణ సాధ్యమవుతుందని చందు నాయక్ హితవు పలికారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీరా సురేష్ నాయక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, ఉర్సుల కుమార్, రైతులు ఆవుల శ్రవణ్, నేతాజీ, తాండ్ర ఆనందం, చింతకింది రాజు, కర్రె సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.