వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి బివి రాఘవులు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రకటించడాన్ని స్వాగతిస్తు న్నామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ సమస్యలను చర్చల ద్వారా, నిపుణుల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బిఆర్ఎస్, వైసిపిలు అధికార పార్టీపై అక్కసుతో కాకుండా తెలుగు ప్రజల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించు కోవడానికి చొరవ చూపెట్టాలన్నారు. రాష్ట్రాలు ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాల పరిమితి ప్రకటించుకుని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని సూచించారు.
దేశ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తున్నారని రాఘవులు విమర్శించారు. ప్రపంచ టెర్రరిస్ట్‌లాగా అమెరికా వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షులు మదురో, అతని భార్యను ఎత్తుకుపోయి నిర్బంధించినా మోడీ మౌనం వీడటం లేదన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరి స్తున్న ట్రంప్ చర్యలను మోడీ ఖండించాలని డిమాండ్ చేశారు. వెనిజులాపై అమెరికా టెర్రరిస్టుల మాదిరిగా వ్యవహరిస్తుంటే, ఉభయులు చర్చించుకుని శాంతిగా ఉండాలని భారత్ నాయకులు ప్రకటించడం సరైనది కాదన్నారు. చైనా, రష్యాతోపాటు బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా, మెక్సికో, ఉరుగ్వే సహా అనేక దేశాలు అమెరికా చర్యపై ఆగ్రహంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా చర్యలను అనేక ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయన్నారు. భారత్ విశ్వగురు అని చెప్పుకునే మోడీ మౌనం పాటిస్తున్నారన్నారు. భారతదేశాన్ని, దేశ నాయకత్వాన్ని అమెరికా అధ్యక్షులు అవమానపరుస్తున్నా ప్రధాని మోడీ నోరు విప్పడం లేదన్నారు. దేశంలో ఉన్న అటవీ, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీ, మిట్టల్ లాంటి సంస్థలకు కేటాయించి దోచుకోవడానికే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మావోయిస్టులు, ఆదివాసులపై దాడులు చేస్తోందని చెప్పారు.