వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత
నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వందలాది పేద కుటుంబాల ఇళ్లను భారీ పోలీస్ బలగాలతో కూల్చివేయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు. నివాస హక్కు ప్రతి పౌరుడి మౌలిక హక్కు అని, ఆ హక్కును రక్షించాల్సిన ప్రభుత్వం పేదలను రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఆందోళన చేసిన సిపిఎం నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్భందించడం అక్రమ చర్య అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు అని, ఆ హక్కును అణగదొక్కడం ప్రభుత్వం నిరంకుశ వైఖరిని చూపిస్తోందన్నారు. అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను వెంటనే షరతుల్లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ స్థలాలు కేటాయించాలని, డబల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అన్నారు.
పేదల హక్కుల కోసం సిపిఎం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, న్యాయపరంగా మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నున్నా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.