వైకల్యంతో లక్ష్యాలకు దూరంగా ఉండకూడదు-ఐటిడిఏ పీ ఓ రాహుల్
భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో నడపబడుతున్న వికాసం పాఠశాల (చెవిటి, మూగ, రేచీకటి) బాల బాలికలకు చేతులు మరియు కనుసైగల ద్వారా చదువుతోపాటు వారికి నచ్చిన క్రీడలలో నిష్ణాతులుగా చేయడానికి క్రీడా వస్తువులు అందజేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
దివ్యాంగుల దినోత్సవం రోజున భద్రాచలం పట్టణంలోని వికాసం పాఠశాల మూగ, చెవిటి, రే చీకటి పిల్లలతో ఐటిడిఏ పీవో రాహుల్ దంపతులు సరదాగా గడిపి 60 వేల రూపాయల విలువగల క్రీడా సామాగ్రిఅయిన టేబుల్ టెన్నిస్ సెట్, చెస్, క్యారం బోర్డ్, టెన్నికాయిట్ ఆట వస్తువులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరంలో న్యూఢిల్లీ మోటా సంస్థ ద్వారా వికాసం స్కూల్ భద్రాచలంలో స్థాపించారని, ఆ సమయంలో కరోనా ఉండడం వలన 2022 ఏప్రిల్ మాసంలో పాఠశాల ప్రారంభమైందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఐటీడీఏల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఏ ఒక్క వికాసం పాఠశాలలో కూడా ఐటీడీఏ తరఫున ఆట వస్తువులు ఇవ్వడం జరగలేదని, ముఖ్యంగా టేబుల్ టెన్నిస్ క్రీడా సెట్టు 46 వేల వ్యయంతో కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని, మొట్టమొదటిసారి భద్రాచలం వికాసం స్కూల్లోనే టేబుల్ టెన్నిస్ క్రీడను ప్రారంభించడం జరిగిందని అన్నారు. వికాసం పాఠశాల అభివృద్ధి చేసి అధిక సంఖ్యలో బాల బాలికలను చేర్చుకోవడానికి నిధుల కోసం మోటాసంస్థ న్యూఢిల్లీకి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, ప్రస్తుతం ఈ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి విద్యార్థిని విద్యార్థుల సౌకర్యం కోసం ఐటిడిఏ ద్వారా నిధులు సమకూరుస్తున్నామని అన్నారు. ఈ పాఠశాలల్లో 60 మంది బాలబాలికలు విద్యనభ్యసిస్తున్నారని, ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయని అన్నారు.
ఆడపిల్లలు-38 మంది
మగ పిల్లలు-22 మంది
చెవిటి మరియు మూగ కలిపి-48 మంది, రేచీకటి-12 మంది పిల్లలు ఉన్నారని అన్నారు.
ఈ పాఠశాలలో ప్రిన్సిపాల్ అరుణకుమారి, ప్రియాంక, కృష్ణవేణి, అరుణ టీచర్లు పనిచేస్తున్నారని అన్నారు.