శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పేరుకుపోతున్న చెత్త
మేడారం జాతర ప్రభావంతో పెరిగిన రద్దీ
భక్తుల పట్ల అధికారుల ఘోర నిర్లక్ష్యం-పారిశుద్యంలో పూర్తిగా విఫలం
దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు తొలుత ఐనవోలుకు చేరుకుని స్వామి దర్శనం చేసుకుని అనంతరం మేడారం వైపు వెళ్లడంతో ఆలయ క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.అయితే ఈ పెరిగిన రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు,ఆలయ కమిటీ పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు.ప్రజా ప్రతినిధులు,మంత్రులు,దేవాదాయ శాఖ అధికారులు,జిల్లా కలెక్టర్లు పలుమార్లు ఆలయాన్ని సందర్శించినప్పటికీ పారిశుధ్యంపై మాత్రం ఎలాంటి దృష్టి సారించకపోవడం కోచనీయం అని భక్తులు విమర్శిస్తున్నారు.జాతరలు అంటే ముందుగా ప్రధానంగా ఉండాల్సింది పారిశుధ్యం,తాగునీరు,బాత్రూములు,మరుగుదొడ్లు,స్నానపు గదులేనని,కానీ ఈ అంశాల్లో ఒక్కదానిపై కూడా సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆలయ పరిసరాల్లో కనీసం డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెత్త ఎక్కడపడితే అక్కడ పేరుకుపోతోంది.తిన్న ఇస్తార్లు,ప్లేట్లు,చెత్తాచెదారం ఆలయ ప్రాంగణమంతా దర్శనమిస్తుండగా,చేతులు కడుక్కోవడానికి,ప్లేట్లు శుభ్రం చేసుకోవడానికి అవసరమైన వాష్బేసిన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీంతో మురుగునీరు పారుతూ ఆలయ పరిసరాలు దుర్వాసనతో నిండిపోయి పారిశుధ్య పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక తాగునీటి వసతులు లేక వృద్ధులు,మహిళలు,చిన్నారులు క్యూ లైన్లలో దాహంతో అల్లాడిపోతున్నారు.ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు నీటి బాటిళ్లు విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.మరుగుదొడ్లు,స్నాన ఘట్టాల నిర్వహణ కూడా పూర్తిగా అధ్వాన్నంగా ఉందని,కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తున్నా భక్తుల సౌకర్యాలపై శ్రద్ధ లేకపోవడం దారుణమని,మేడారం జాతర నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరుగుతుందని ముందే తెలిసినా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.జాతర ముగిసేలోపు పారిశుధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి,డస్ట్బిన్లు,వాష్బేసిన్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు,మరుగుదొడ్లు,స్నానపు గదులు,వైద్య సదుపాయాలు తక్షణమే మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్,దేవాదాయ శాఖ అధికారులు,సంబంధిత మంత్రి,ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి స్వయంగా పర్యవేక్షించి చర్యలు తీసుకుని భక్తులకు అవసరమైన మౌలిక వసతులు వెంటనే కల్పించాలని భక్తులు గట్టిగా కోరుతున్నారు.