శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్స్నశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్స్న
రూ.86.30 కోట్లతో ఆలయ పునర్ ప్రతిష్టాపన, అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం–గ్రామీణ ఆర్థికాభివృద్ధి,పర్యాటకానికి ఊతం : ముఖ్యమంత్రి రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ ప్రతిష్టాపనతో పాటు గ్రామాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా చేపట్టనున్న విస్తృత స్థాయి అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం ఘనంగా శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రావి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ ప్రతిష్టాపన పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాల నిర్మాణం, ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి అధికారికంగా శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.86.30 కోట్లతో అమలు చేయనున్న ఈ అభివృద్ధి పనులు కొడవటంచ గ్రామ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనున్నాయని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,దేవాలయాల పునరుద్ధరణ అనేది కేవలం ఆధ్యాత్మిక కోణానికే పరిమితం కాదని, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఇది ప్రధాన సాధనమని అన్నారు. ఆలయాల అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పిస్తే గ్రామాలకు ఆర్థిక చైతన్యం వస్తుందని, పర్యాటక రంగం విస్తరించి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.కొడవటంచ గ్రామాన్ని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఆలయ పునర్ ప్రతిష్టాపన పూర్తయిన అనంతరం భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు అందుబాటులోకి వస్తాయని,అతిథి గృహాల నిర్మాణంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి సమస్యలు తొలగుతాయని చెప్పారు.అలాగే ఆలయానికి అనుసంధానంగా అంతర్గత రహదారుల నిర్మాణం జరగడం వల్ల గ్రామంలో రాకపోకలు మరింత సులభతరం అవుతాయని వివరించారు.ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడి, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.ఆలయ కేంద్రంగా గ్రామ అభివృద్ధి జరిగితే వ్యాపారాలు, సేవా రంగాలు విస్తరించి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కట్టంగూరు రామ్ నర్సింహారెడ్డి, ఎన్ఎస్ఆర్ సంస్థలు అధినేత నాయిని సంపత్ రావు,దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈఓ మహేష్, ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.