సమగ్ర పశు ఆరోగ్య సంరక్షణకు నట్టల నివారణ కార్యక్రమం
పంటలతో పాటు పశు సంపద కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.గొర్రెలు,మేకల పెంపకదారులు తమ జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ (డివార్మింగ్) మందులు సకాలంలో తాపించాలని ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలో గొర్రెలు,మేకల పెంపకం ప్రధాన జీవనాధారంగా ఉన్న కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా పశుసంవర్ధక రంగం బలోపేతమవడంతో పాటు మాంస ఉత్పత్తి,ఉపాధి అవకాశాలు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన దోహదం కలుగుతుందన్నారు.జిల్లాలో గొర్రెలు,మేకలు కలిపి మొత్తం 6,25,160 పశువులు ఉన్నాయని తెలిపారు.ఇప్పటివరకు 70 డివార్మింగ్ క్యాంపులు నిర్వహించి,1,543 మంది రైతులకు చెందిన 1,98,504 గొర్రెలు,మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వివరించారు.గొర్రెలు,మేకలకు సకాలంలో డివార్మింగ్ మందులు ఇవ్వడం వల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయని,ప్రతి పశు పెంపకదారుడు ఈ క్యాంపులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
“నట్టల నివారణ మందుల వల్ల కలిగే లాభాలు”
జీర్ణక్రియ మెరుగుపడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయి.బరువు పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.పశువులు చురుగ్గా మారి ఉత్పాదకత పెరుగుతుంది.మాంస ఉత్పత్తి పెరుగుదల
బరువు పెరిగిన గొర్రెలు మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించవచ్చు.ఒక్క గొర్రెకు సగటున 1–1.5 కిలోల అదనపు బరువు పెరిగే అవకాశం ఉంటుంది.గొర్రెల మరణాలు తగ్గింపు
ముఖ్యంగా పిల్ల గొర్రెల్లో (ల్యాంబ్స్) పురుగుల వల్ల వచ్చే మరణాలు గణనీయంగా తగ్గుతాయి,రోగబాధ (మోర్బిడిటీ) తగ్గి మందల స్థిరత్వం పెరుగుతుంది.
“గొల్ల కులాల ఆదాయం పెరుగుదల”
ఆరోగ్యమైన గొర్రెలు అధిక ఉత్పాదకత కలిగి ఉండడం వల్ల విక్రయాల ద్వారా గొల్ల కులాల ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.గొర్రెలు,మేకలకు పశు వైద్య నిపుణుల సలహా మేరకు సరైన మోతాదులో,క్రమం తప్పకుండా డివార్మింగ్ మందులు ఇవ్వాలని సూచించారు.వ్యాధులు సోకిన తర్వాత చికిత్స చేయడం కన్నా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.