సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలో పారదర్శకత,జవాబుదారీతనం పెరుగుతాయి
సమాచార హక్కు చట్టం-2005 ద్వారా పౌరులకు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే హక్కు కలిగిందని,దీని వల్ల పాలనలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం మరింత బలోపేతం అవుతుందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ తెలిపారు.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ,వరంగల్ ఆధ్వర్యంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం ద్వారా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వ అధికారులందరికీ సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు.ప్రజలు అడిగే సమాచారాన్ని సకాలంలో,ఖచ్చితత్వంతో అందించాలంటే చట్టంలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి కార్యాలయంలో నియమితులైన ప్రజా సమాచార అధికారి,అప్పీలేట్ అధికారి లు సమాచార హక్కు దరఖాస్తులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ శిక్షణ నిర్వాహకుడు మార్గం కుమార్ స్వామి,శిక్షకుడు ఈ.మోహన కృష్ణ (జిల్లా సమన్వయకర్త) లు సమాచార హక్కు చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై, చట్టంలోని ముఖ్య నిబంధనలను అధికారులకు వివరించారు.