సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం
సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశం మంగళవారం హనుమకొండ జిల్లాలో నిర్వహించారు.ఈ సమావేశానికి కాడర్ల ప్రకాశ్ చారి అధ్యక్షత వహించారు.సమావేశంలో సింగరేణి,బొగ్గు రంగానికి చెందిన విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం మరియు పెన్షన్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు కాడర్ల ప్రకాశ్ చారి మాట్లాడుతూ సీపీఆర్ఎంఎస్ కింద విశ్రాంతి ఉద్యోగులకు అందించే ప్రయోజనాలను పెంచి రూ.25 లక్షల వరకు అందించాలని కోల్ ఇండియాను డిమాండ్ చేశారు.అలాగే కనీస పెన్షన్ను డిఏతో కలిపి నెలకు రూ.15,000గా పెంచాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పెన్షనర్లను ఆయన కోరారు.సంఘం వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్. మాధవరావు మాట్లాడుతూ బొగ్గు రంగానికి చెందిన అన్ని పెన్షనర్లు ఐక్యంగా ముందుకు వచ్చి ఢిల్లీలో జరిగే ధర్నాకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సమిష్టి పోరాటం అవసరమని ఆయన పేర్కొన్నారు.ప్రధాన కార్యదర్శి చిదరాల సత్యనారాయణ మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగులకు గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.20 లక్షల వరకు పెంచాలని కోల్ ఇండియాను డిమాండ్ చేశారు.విశ్రాంత అధికారుల తరహాలోనే సింగరేణి విశ్రాంత కార్మికులు, ఉద్యోగులు కూడా ఐకమత్యంగా ఉండి సింగరేణి ఏరియాలోని అన్ని ప్రాంతాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి సీనియర్ సిటిజన్స్ ఫోరం తరఫున దేవాచారి, పీవీఎస్ రావు హాజరై సీనియర్ సిటిజన్ల హక్కులు, రక్షణ చర్యల గురించి వివరించారు.అలాగే ప్రభుత్వం అందిస్తున్న పలు రాయితీలను సీనియర్ సిటిజన్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో రామ్మూర్తి, రవీందర్ గుప్తా, చిదరాల సత్యనారాయణ, సంపత్ రెడ్డి, పి. రాజయ్య, ఎం. దామోదర్ రెడ్డి, ఎం.డి. అఫ్జల్ పాషా, నలబాల దామోదర్ తదితరులతో పాటు మొత్తం 45 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.