సైబర్ నేరంలో ఆరోపణలు ₹547 కోట్ల మోసం
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఒక భారీ సైబర్ నేర కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితులు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో కలిసి పథకం ప్రకారం మోసాలు చేసి బాధితులను సుమారు ₹547 కోట్ల మేర మోసపుచ్చినట్లు తెలిపారు.సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోని
వీఎం బంజర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నిందితులు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే పేరుతో వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించి తర్వాత ఆ ఖాతాలను సైబర్ మోసాలకు ఉపయోగించినట్లు చెప్పారు.ముఖ్య నిందితులు పొత్రు మనోజ్ కళ్యాణ్, ఉదతనేని వికాస్ చౌదరి, పొత్రు ప్రవీణ్, మేద భానుప్రియా, మేద సతీష్, మోరంపూడి చెన్నకేశవ — వీరు అందరూ సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు చెందిన వారని తెలిపారు. ఈ ఆరుగురు అరెస్టు చేయబడ్డారని చెప్పారు.ఈ కేసు గత సంవత్సరం డిసెంబర్లో వీఎం బంజారా పోలీస్ స్టేషన్లో సాయికిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. నిందితులకు సహకరించి తమ బ్యాంకు ఖాతాలను వినియోగానికి ఇచ్చిన మరో 17 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కమిషనర్ వివరించిన మేరకు, నిందితులు కాల్ సెంటర్లు నడుపుతూ విదేశీ సైబర్ నేరగాళ్లతో కలిసి వివాహ పరిచయాల పేరుతో, రివార్డు పాయింట్లు, ఆన్లైన్ గేమింగ్, బేటింగ్, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పేర్లతో ప్రజలను మోసగించినట్లు చెప్పారు.
నిందితుల బ్యాంకు ఖాతాలపై దేశంలోని పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సైబర్ ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. ఈ మోసంలో డబ్బు లావాదేవీలను ట్రేస్ చేయడం, ఇందులో పాలుపంచుకున్న మరోవ్యక్తులను గుర్తించడం కోసం దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ పేర్కొన్నారు.