
స్టేషన్ ఘన్పూర్ పరిధిలో గంజాయి విక్రయానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల శ్రీరామ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని బలర్ష ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సీఐ జి. వేణు ఆదేశాల మేరకు ఎస్ఐలు పిట్ట రాజేష్, రమేష్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో బస్టాండ్ సమీపంలో ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల శ్రీరామ్ తమ స్నేహితులు చేరిపల్లి ప్రసాద్, మునిగేల రాజేష్, జఫర్గడ్ మండలం కొనాయిచలం గ్రామానికి చెందిన జాటోత్ రాజేష్ అలియాస్ నితిన్‌తో కలిసి గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తూ, అదే సమయంలో సేవిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసులు అక్కడికే చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకుని సుమారు 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో జనగామ కోర్టుకు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.