స్థానిక ఎన్నికల్లో గుణవంతులకు మద్దతు
పెద్దంపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర–జాతీయ స్థాయి యువ క్రికెటర్ పసుల రాజు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు ముఖ్య సూచనలు చేశారు. క్రీడారంగంలో అంచెలంచెలుగా ఎదిగి రేగొండ మండల కీర్తిని రాష్ట్ర, దేశ స్థాయిలో నిలబెట్టిన ఆయన, గ్రామాభివృద్ధి కోసం సమాజం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో ధనం ఉన్నవారిని కాకుండా గుణవంతులను, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించగల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ప్రజల ఓటు అభివృద్ధిని నిర్ణయిస్తుందని, గ్రామాల పురోగతి కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు.యువత రాజకీయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలని పసుల రాజు పిలుపునిచ్చారు. ప్రశ్నించే యువత ఉంటే అవినీతి, దోపిడీ చేసే నాయకులు భయపడతారని, ప్రజా ధన దుర్వినియోగం జరగకుండా ఆపగలమని చెప్పారు.
స్వచ్ఛమైన పాలన, పారదర్శక వ్యవస్థతోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, యువత శక్తి, సమాజ బాధ్యతపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.