
కుటుంబ కలహాలే కారణమా? – ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయి విషాదం
హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ డివిజన్ కృష్ణ కాలనీలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. నిందితుడు మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి జరిగిన ఘర్షణ అనంతరం భార్య మృతి చెందింది. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ కలహాలే ప్రధాన కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ప్రేమ వివాహంతో ప్రారంభమైన వారి దాంపత్య జీవితం విషాదాంతంగా ముగియడం పట్ల కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.